శ్రీ మేధా దక్షిణామూర్తి స్వరూప శ్రీ త్రికోటేశ్వర స్వామి వారి దేవస్థానము

9 months ago
27

మహిమాన్విత క్షేత్రం, త్రికోటేశ్వరుని సన్నిధి, కోటప్పకొండ.
పల్నాడు జిల్లా, నరసరావుపేట మండలం, పరిధిలో ఉన్న త్రికోటేశ్వరుని సన్నిధి. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన మహిమాన్విత క్షేత్రం. ఇక్కడ స్వర్గలోక అది నేత ఇంద్ర దేవుడు, వైకుంఠ అధినేత విష్ణు, కైలాశాధినేత అయిన ఆ మహా శివుడు త్రికోటేశ్వరుని రూపంలో కొలువైన దివ్య సన్నిధి ఈ కొండ. యల్లమంద కోటయ్యగా భక్తులకు ప్రీతి పాత్రుడైన శివుడు కోటప్పకొండలో కొలువై భక్తుల కొంగు బంగారంగా విలసిల్లుతున్నాడు. ప్రతి ఏటా కార్తీకమాసంలో కోటప్పకొండ తిరుణాళ్ళు, కార్తీక వన సమారాధనలు కూడా జరుగుతాయి. ఈ తిరణాళ్లలో చుట్టుప్రక్కల ఊర్లనుండి ప్రభలతో భక్తులు దేవాలయాన్ని దర్శిస్తారు.

చారిత్రకత..

చారిత్రక త్రికోటేశ్వర ఆలయం క్రీస్తు శకం 1172 నాటికే ప్రసిద్ధి చెందినట్లు వెలనాటి చోళ రాజైన కుళొత్తుంగా చోళరాజు, సామంతుడు మురంగినాయుడు వేయించిన శాసనాల ద్వారా తెలుస్తోంది.
నరసరావుపేట, చిలకలూరిపేట, అమరావతి, పెట్లూరివారిపాలెం జమిందార్లు అలాగే శ్రీకృష్ణదేవరాయలు స్వామివారికి భూములు సమర్పించారు.
భక్తులైన సాలంకులు, అతని ముగ్గురు తమ్ముళ్లు పంచబ్రహ్మ స్థానంగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వర లింగస్వరూపులు కావటం ఆనందవల్లి (గొల్లభామ) శివైక్య సంధానమవడం ఈ క్షేత్ర వైశిష్ట్యం.
బ్రహ్మోపదేశం చేసిన క్షేత్రంగా..: దక్షయజ్ఞం విధ్వంసం తర్వాత శివుడు బ్రహ్మచారిగా చిరుప్రాయపు వటువుగా, మేధాదక్షిణామూర్తి రూపంలో కోటప్పకొండలో వెలిసినట్లు స్థల పురాణం.
దేవతలకు, మహర్షులకు, భక్తులకు బ్రహ్మోపదేశం చేసిన క్షేత్రంగా కూడా గుర్తింపు ఉంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు త్రికూటములుగా వెలసిన త్రికోటేశ్వర స్వామి సన్నిధానమే కోటప్పకొండ.
గర్భాలయ దక్షిణద్వారమందు ఉన్న శాసనాల వల్ల సిద్ధమల్లప్ప, శంభుమల్లమ్మలు వేయించిన శాసనాలు ఆలయ ప్రాచీనతను తెలియజేస్తున్నాయి.
క్రీస్తు శకం 6, 7శతాబ్దాల్లోనే ఈ ప్రాంతాన్ని ఆనందగోత్రికులు, విష్ణుకుండినులు పాలించి త్రికూటాధిపతులుగా బిరుదులు పొందారు. నిర్మలత్వం, ప్రశాంతత మూర్తీభవించిన ఓంకార స్వరూపుడు దక్షిణామూర్తి.
ఈ స్వామి అనుగ్రహంతో సర్వవిద్యలు లభిస్తాయని ప్రతీతి. దక్షిణాభిముఖంగా ఆశీనుడైన మూర్తి కనుక దక్షిణామూర్తి పేరు సార్థకమైందని చెబుతారు. 200 ఏళ్లకు పూర్వం బ్రహ్మశిఖరంపై పినపాడు వేలేశ్వర అయ్యవారు జనాకర్షణ, మొక్కుబడులు, అష్టదిగ్బంధ గణపతి, సంతాన కోటేశ్వర యంత్రాలు స్థాపించినట్లు శాసన ఆధారాలు ఉన్నాయి.
విష్ణు శిఖరం మేధాదక్షిణా మూర్తి వద్ద విష్ణువు కూడా బ్రహ్మోపదేశం పొందినట్లు స్థల పురాణం చెబుతోంది. దీంతో ఇక్కడ విష్ణు శిఖరం ప్రసిద్ధి చెందింది. అయితే పూర్వాశ్రమంలో ప్రజలకు ఇవి తెలియవు.

బ్రహ్మ శిఖరం దక్షయజ్ఞం అనంతరం త్రికోటేశ్వరుడు కోటప్పకొండలో ధ్యానశంకరునిగా, దక్షిణామూర్తిగా వెలిశాడని స్థల పురాణం. ఆయన వద్ద బ్రహ్మ, విష్ణువులు అనేక మంది దేవతలకు ఇక్కడ బ్రహ్మోపదేశం చేశారు. అందువల్లే ఇక్కడ బ్రహ్మశిఖరం ఏర్పాటైంది.

Loading comments...